ప్రభువునందు ప్రియక్రైస్తవ విశ్వాసులకు క్రైస్తవ సాహిత్యాలను గూర్చి అనేకులు అనేక విధములుగ గ్రంథ రచనలు చేసియున్నారు. అయితే సముద్రము కంటెను లోతైనదియు భూమి, ఆకాశమునకంటే ఎత్తయినదియు, బహులోతైన మర్మములు కల్గిన పరిశుద్ధ గ్రంథములోని ప్రవచనము మన కంటికి ఒక చిన్న వేదరూపముగా అనగా పాతనిబంధన క్రొత్త నిబంధన అను రెండు వేదభాగాలుగ వుండి, మనము చేత పట్టుకొన్నంత సులభముగా కనపడినను, అందులో దాగియున్న దైవనిగూఢ ప్రణాళికలు, భూమ్యాకాశములు పట్టజాలనంత మర్మాలున్నాయి. వాస్తవమునకు పరిశుద్దగ్రంథములో బయల్పరచబడి యున్నటువంటి మర్మములు వాటిలో గుప్తమైయున్న దైవరహస్యాలు మరి ఏ గ్రంథములోను మరి ఏ సాహిత్యములోను మనము తెలిసికోలేము. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బైబిలన్నది మహాసాగరము కంటే గొప్పది.
ప్రియపాఠకులారా! దేవుడు తన ప్రవక్తల చేత రచింపజేసిన వేదభాగాలన్నియు ఒక విధానమైతే ప్రత్యేకించి మొదటి ఐదు కాండములు- ఆది నిర్గమ లేవీయ సంఖ్యా ద్వితీయోపదేశ - మోషే వ్రాసిన పంచకాండముల యొక్క రచన మహా ఆశ్చర్యకరమైనది. ప్రియపాఠకులారా! మోషే నిరక్షరాస్యుడు, నాలుక మాంద్యము కలవాడు, పూర్తిగా దైవత్వమన్నదేమిటో తెలియనివాడు, దేవుడు ఎవరో కూడా తెలియని స్థితిలో జీవించిన మోషేకు వేదజ్ఞానము కలిగి ఐదు కాండములకు గ్రంథకర్త అయ్యాడంటే కేవలము దైవసంకల్పము, దైవచిత్తము, దైవాత్మ ప్రేరేపణ, ఆయన జ్ఞానము, దైవాత్మ ఆవేశము, దైవ నడుపుదల, దైవ ఎన్నిక ఇన్ని అంశాలు మోషే పక్షముగా దైవత్వము ద్వారా క్రియ జరిగించాయి.
ఇందును బట్టి మోషే పంచకాండాలకు గ్రంథకర్తయై లోకసృష్టికి పూర్వము భూమియొక్క స్థితి, జలరాశులయొక్క స్థితి, సృష్టియొక్క నిరాకారస్థితి, శూన్యమైయున్న అనంత విశ్వముయొక్క స్థితి, దేవుని ఆత్మ చీకటి అగాధ జలముల మీద అల్లలాడిన స్థితి, దైవాత్మ వాక్కు చేత వెలువడిన వెలుగు-ఆ వెలుగు ద్వారాను వాక్కు ద్వారాను రూపించబడిన సృష్టి-సృష్టములు, జరిగిన సృష్టికార్యములు, అటు తర్వాత ఏదెను తోట నిర్మాణము, సకల ప్రాణులయొక్క పుట్టుక , ఆ తర్వాత నరునియొక్క దేహ నిర్మాణము, నారీ నిర్మాణము, తోటలోని జీవవృక్షము, మంచిచెడు వివేకమిచ్చు వృక్షము, జిత్తులమారి సర్పమును గూర్చిన వివరములు, సర్పము ద్వారా స్త్రీ మోసపోవుట, నరజంట పాపప్రవేశము, తద్వారా సృష్టిలోని వైపరీత్యము, వాతావరణ కలుషితము, పంచభూతములలో వైరుధ్యము.
దేవుని చేత నరజంట పరిశుద్ధ వనము నుండి వెలివేయబడుట, ఆ విధముగా వెలివేయబడిన నరజంట నుండి విస్తరించిన జనాంగము, వారితోబాటు విస్తరించిన పాపము, తత్ఫలితముగా నిర్మించిన ఓడ ద్వారా నోవహు కుటుంబమునకు కల్గిన రక్షణ.
ప్రియపాఠకులారా! ఇవన్నియు మోషేకు పూర్వము, మోషే పుట్టుక మునుపు కొన్ని వేల సంవత్సరములకు పూర్వము జరిగిన సంఘటనలను మోషేకు దేవుడు బయల్పరచి, కలము కాగితము, అక్షర జ్ఞానము లేని దినములలో పేనాలు, పెన్సిళ్ళు లేని దినములలో టైప్‌మిషన్లు లేని దినాలలో వ్రాయించిన గ్రంథమే మొదటి పుస్తకము.
ప్రియపాఠకులారా! ఆదినములలో మోషేకు చదువుచెప్పిన ఉపాధ్యాయులుగాని, ప్రైవేటు మాస్టర్లు గాని, ఎవరును లేరు. మోషేకు అన్ని విధాలుగ అక్షరజ్ఞానము, వేదజ్ఞానము, వేదరచనా జ్ఞానము, సమస్తము నేర్పినవాడు దేవుడే. దేవుడే ఆనాడు తన సృష్టియొక్క మర్మములను మోషేకు దర్శనముల ద్వారా కండ్లకు కట్టినట్లుగ బయల్పరచి-దేవుడు తాను చేసిన ప్రతి సృష్టి కార్యమును మోషేకు ప్రత్యక్షముగా, ప్రయోగాత్మకముగా మనోదృష్టితో దర్శింపజేసి, కాగితము, కలము, అక్షరజ్ఞానము లేని ఆ దినములలో, పక్షి ఈకలు సిరాతో లిఖింపజేసి, నేటి నిజవాసులమైన మనకు పంచకాండముల రహస్యాలు బయల్పరచి యున్నాడు.
వాటిలో ఒకటి ఏదెను చరిత్ర. ఈ పుస్తకము ఏదెను వనములో దాగియున్న గొప్ప రహస్యములపైన ఆధారపడియున్నది. ఇక చదవండి . . .