తెలుగు రిఫరెన్స్ బైబిల్
సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము 1 తిమోతి 2:15. ‘ఉపదేశించు’ అనే పదానికి మూలవాక్యంలో ‘సరిగా విభాగించు’ అని వ్రాయబడింది. దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి అంటే దానియొక్క విస్తృత అర్థాన్ని అవగతం చేసుకోవాలి. కేవలం ఒక వచనాన్నో లేక పరిమిత జ్ఞాపకశక్తికి వచ్చిన కొన్ని వచనాలను బట్టి పరిపూర్ణ అర్థాన్ని కనుగొనే విషయంలో సఫలులం కాలేము, ఇతరులకు మేలైన వాక్యసత్యాన్ని పంచలేము. ప్రభువు శోధనలో పోరాడినప్పుడు పలుచోట్ల వ్రాయబడిన వాక్యాలను ఉదహరిస్తూ ఎదుర్కున్నాడు. వాక్యంతోనే శోధించినప్పుడు మరొక చోట ఇలా వ్రాయబడి ఉందని ఆ వాక్యాన్ని ముందుపెట్టి శోధనలో విజయాన్ని సాధించాడు. మన శోధన సమయంలో అనేక సంశయాలు, తడవు చేయుట, చివరికి అపజయం ...వీటన్నిటికీ మూలం దేవుని లేఖనాల విషయంలో తరవుగా లేకపోవడమే ఒక కారణం.
బైబిలు అరవై ఆరు పుస్తకాల సమాహారం. ఈ పుస్తకాలలోని పత్రి వచనం ఒకదానిపై ఒకటి ఆధారపడి దేవుని యొక్క మూల ఉద్దేశంవైపు అవి పరుగులు తీస్తూవుంటాయి. బోధకుడైన ప్రభువు చెప్పిన బోధలలో కాని ప్రవక్తలు అపొస్తలుల సందేశాలలో మరియు వ్రాయబడిన ఉత్తరాలు అన్నింటింలో అరవై ఆరు పుస్తకాలలోని లేఖనాలను క్రోడీకరిస్తూ ఉపదేశించుట జరిగింది. వాక్యమై సత్యమైయున్న దేవున్ని నరమాత్రులమైన మనం అరవై ఆరు పుస్తకాలలో విస్తరించియున్న అర్థాన్ని ఒడిసి పట్టాలి అంటే ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని సహకారంతో పాటు, మన ముందు వాక్య పరిచారకులు దేవుని పొలంలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి జీవితాలను పణంగా పెట్టి తరచి తరచి సమకూర్చిన రిఫరెన్స్ లను పరిశోధించుకుంటూ వాక్యాన్ని మననం చేస్తే పొందే మేలు, గ్రహించే వాక్య ప్రత్యక్షత మాటలలో చెప్పలేనిది. వాక్య ధ్యానం ఇలా అర్థవంతముగా ఉన్నప్పుడే దేవుని వాక్యంలో నిగూఢమైవున్న దైవోద్దేశాన్ని అర్థంచేసుకోగలం. బెరయవారు- ‘ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి’ అని చెప్పబడింది. సత్యమును ఆసక్తితో వినుట లేక చదువుటయే కాదు, తెలుసుకున్న సత్యాన్ని క్షణ్ణంగా పరిశీలించుట కూడా చాల ప్రాముఖ్యం. ఎందుకంటే అనేక వేల సంవత్సరాలను దేవుని లేఖనం ఉనికిలో ఉంటూ తరతరాలనుండి అంతకంతకు వెలుగును వెదజల్లుతూ ఉంది. అటువంటి మహోన్నతమైన పరిపూర్ణ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు యుద్ధరంగంలో ధైర్యంగా నిలబడగలం. ఇతరులకు క్రీస్తు సత్యాన్ని స్పష్టంగా వివరించగలం. వాక్యధ్యాన విషయంలో సోమరులై ఏదో ఒక వాక్యాన్ని పట్టుకుని దేవుడే సహాయం చేస్తాడు, పరిశుద్ధాత్ముడే నింపుతాడు అంటూ యుద్ధరంగంలో దిగుతున్న అనేకులను నేటి తరంలో చూస్తున్నాము. ఇలాంటి వారు వీరులుగా నిలబడలేరు కదా జయశీలుడైయున్న మన దేవునికి అపజయాన్ని మూటకట్టి ఇచ్చేవారుగా ఉంటారు. ‘యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు’ (కీర్తన 1:2). ఆత్మానందం, దివారాత్రము ధ్యానము ఇవే జీవంగల చెట్టును ఆకువాడనీయదు, తగిన కాలమందు ఫలాన్ని పంచిపెట్టేదిగా ఉంటుంది.
దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి (ఎఫె 6:17). ఖడ్గంకు పదునుంటేనే అది ఖడ్గంగా పిలవబడేది లేనిచో అది కావలం ఒక కర్రగానే మిగిలిపోతుంది. మనకు అందుబాటులో ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూ వాక్యాన్ని శ్రద్ధతో ధ్యానించినప్పుడు ఆత్మీయ యుద్ధంలో నీకంటే బలవంతులు ఎవరు ఉంటారు? వాక్యప్రియులందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో ఈ రిఫరెన్స్ బైబిల్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది (హెబ్రీ 4:12) అని చెప్పబడింది. పదునైన ఎంతో బలం కలిగిన వాక్యంతో ఆత్మీయ అక్కరలకు తీర్చుకొనట, శోధన సంశయాలలో జవాబులను పొందుట మాత్రమేకాదు ఇతరులకు ఉపదేశించే విషయంలో శక్తిగలవారుగా తయారుకావడానికి ఈ ‘తెలుగు రిఫరెన్స్ బైబిల్’ తన వంతు సహకారాన్ని వాక్యప్రియులకు అందిస్తుందని ఎంతగానో నమ్ముతున్నాము.
“వయస్సు వచ్చినవారు అభ్యాసముచేత మేలు కీడులను వివేచించుటకు సాధకముచేయబడిన జ్ఞానేంద్రియములు కలిగియున్నారు గనుక బలమైన ఆహారము వారికే తగును” హెబ్రీ 5:13,14. వాక్యధ్యానము, అభ్యాసములు వలన సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి బలవంతులై ఇతరులకు చెప్పగల శక్తిమంతులుగా ప్రతి ఒక్కరూ కావాలనే ఈ రిఫరెన్స్ బైబిల్ ను దేవుని అనుగ్రహం వలన మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మేలుపొంది ఎప్పుడూ వినేవారు మాత్రమే కాక నిజమైన సత్యం విషయంలో బలవంతులై బహు ధైర్యంగా ఇతరులకు వాక్యాన్ని అందించే శక్తివంతులు కావాలని మా ఒకే ఒక ఆశ, మరియు దేవునియొద్ద మా ప్రార్థన.