తారే జమీన్ పర్ 2007లో విడుదలై పేరుగాంచిన చిత్రం. ఈ చిత్రాన్ని అమీర్ ఖాన్ తన సొంత నిర్మాణ సంస్థయైన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ ద్వారా నిర్మించి, దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర కథాంశం ముందుగా రచయిత, సృజనాత్మక దర్శకుడు అయిన అమోల్ గుప్తే, ఆయన భార్య దీపా భాటియా ఆలోచనల్లో రూపుదిద్దుకుంది. శంకర్-ఎహసాన్-లాయ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ప్రసూన్ జోషి పాటల రాశాడు. చిత్రంలో కనిపించిన కంప్యూటర్ గ్రాఫిక్స్ యానిమేషన్ టాటా ఎలెక్సి లిమిటెడ్ సంస్థకు చెందిన విజువల్ కంప్యూటింగ్ లాబ్స్, 2D యానిమేషన్ వైభవ్ స్టూడియోలు రూపొందించాయి. ధీమంత్ వ్యాస్ శీర్షిక యానిమేషన్ లో పాలుపంచుకున్నాడు. తారే జమీన్ పర్ ప్రపంచవ్యాప్తంగా సినిమా హాళ్ళలో 2007 డిసెంబరు 21న విడుదలైనది. భారతీయ తర్జుమా DVD ముంబాయిలో 2008 జూలై 25న విడుదలైనది. లైక్ స్టార్స్ ఆన్ ఎర్త్ అనే పేరుతో ఒక అంతర్జాతీయ ప్రచురణ DVD 2010 జనవరి 12న విడుదలైంది. వాల్ట్ డిస్నీ కంపెనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఉత్తర అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాలలో పంపిణీ చేయడానికి హోమ్ వీడియో హక్కులను కొనుగోలు చేసింది. ఒక అంతర్జాతీయ స్టూడియో భారతీయ చిత్రం వీడియో హక్కులను కొనుగోలుచేసింది ఇదే ప్రథమం.
ఈ చిత్రం ఎనిమిదేళ్ళ బాలుడు ఇషాన్ కథను చెప్తుంది. ఒక అధ్యాపకుడు అతనికి డిస్లెక్సియా ఉందని గుర్తించేదాకా అతను విపరీతంగా బాధపడతాడు. ఈ సినిమా వ్యాపారపరంగానే కాక విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు పొందింది.